డెలివరీ తర్వాత వీక్నెస్? ...
సరిత చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. తనకి సిటీలో మంచి జాబ్ చేస్తున్న దివాకర్ తో పెళ్లయింది. ఈ మధ్యనే పాప పుట్టింది కూడా. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా, ఇపుడు డెలివరీ తర్వాత ఆమె శరీరం, ఆరోగ్యం రెండింటిలో మార్పులు వచ్చాయి. ఇదివరకు తూరీగలాగ ఎగిరే సరిత, ఇపుడు నడదానికే ఓపిక లేనట్టు తయారయింది. దానికి తోడు, పాపని కూడా తనే చూసుకోవాలి. ఈ జనరేషన్ లో చాలా మంది అమ్మాయిల లాగే ఉంటాయి సరిత ఫుడ్ హాబిట్స్ కూడా. సరిగా తినకపోవడం, జంక్ ఫుడ్.. ఇలా. ఇక ఈ పరిస్థితికి కారణం తను సరిగా ఆహారం తీసుకోకపోవడమే అని సరితకి అర్ధం అయింది. వాళ్ళ ఫామిలీ డాక్టర్ కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది. ఆవిడ సహజంగా పోషణ ఇచ్చే కొన్ని ఆహారాలను తన ఫుడ్ లో చేర్చుకోమని సలహా ఇచ్చారు. మరి అవేమిటో మనమూ చూసేద్దామా..
గర్భం దాల్చిన తర్వాత, ప్రసవం అనంతరం కూడా ఆడవారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు తమ ఆహారం, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డెలివరీ సమయంలో, రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, బిడ్డకు ఆహారం ఇవ్వవలసి ఉంటుంది.అందువల్ల స్త్రీలకు బలహీనంగా అనిపించడం అనివార్యం. ప్రసవం తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, వారి శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. ప్రసవం తరవాత మీ శరీరానికి శక్తి అవసరం. ఈ సమయంలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పళ్ళు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. తద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది, బరువు పెరగడం కూడా కంట్రోల్ లో ఉంటుంది.
కాబట్టి, మీరు మీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకుంటే, ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన వాటిని చేర్చుకోవాలి. ప్రసవం తర్వాత ఏ ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
నట్స్, డ్రై ఫ్రూట్స్: పిస్తా, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, ఎందు ద్రాక్ష, అంజీర్ వంటి నట్స్‌లో శరీరానికి పోషణనిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్లు కె, బి, ఇ పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీర సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇంకా ఈ గింజలు లాక్టోజెనిక్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే అవి తల్లిపాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
పచ్చి కూరగాయలు, ఆకుకూరలు : బ్రోకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్ వంటి ఆకు కూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే.. బరువును అదుపులో ఉంచే అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో కాల్షియం, ఐరన్ ఉన్నాయి, ఇవి మీకు మంచి మాత్రమే కాకుండా తల్లి పాలను పెంచడంలో కూడా సహాయపడతాయి.
ఓట్స్: ఓట్స్‌లో ఫైబర్‌తో పాటు కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని తేలికగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్ ను కిచ్డీ లేదా ఉప్మా రూపంలో తినవచ్చు.
గుడ్లు : ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మరో సూపర్ ఫుడ్- గుడ్డు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోపం తీరిపోయి కండరాలకు సత్తువ కలుగుతుంది. ఎగ్స్, డెలివరీ అనంతరం కణాలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది. వీటిలో ఒమేగా-3 ఫాట్స్ అనే మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి డెలివరీ తర్వాత డిప్రెషన్ నుండి ఉపశమనం ఇస్తాయి.
ఖర్జూరం: బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, శరీరంలో ఏర్పడే రక్తహీనతకు ఖర్జూరం చక్కని సమాధానం. అలసిన శరీరానికి శక్తిని ఇచ్చే సహజ చక్కెరలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు జీర్ణక్రియ, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంటే కాకుండా రక్తం గడ్డకట్టడం, వాపు నుండి రక్షణను అందిస్తుంది.
ఇందులోని అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించాము. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ బ్లాగ్ నచ్చితే like, comment share తప్పక చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)