రేపటి నుంచే శ్రావణ మాసం: ...
కావ్యకి ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. వాళ్ళ అత్తగారిది కాస్త సంప్రదాయం, పద్దతి పాటించే కుటుంబం. కాలేజీ తరవాత డైరక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చున్న కావ్య, ఇపుడిపుడే మెట్టినింటికి అలవాటు పడుతోంది. ఇవాళ అత్తగారు పిలిచి.. రేపటి నుంచే శ్రావణ మాసం. ఈ నేలంతా ఎన్నో పూజలు, పండగలు ఉన్నాయి కదా.. కాస్త నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఏర్పాట్లు చేయమ్మా అని చెప్పారు. సరే అని తల ఊపింది కాని.. ఈ నెల పండగలు, విశేషాలు తనకి అంతగా తెలియవు. దాంతో మళ్ళీ అమ్మకి ఫోన్ చేసి సంగతంతా చెప్పింది. అపుడు ఆవిడ కూతురు ఆత్రానికి నవ్వుతూ.. ఇలా వివరంగా చెప్పారు:
శ్రావణమాసం రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఇది ప్రకృతి పరవశించే మాసం. శ్రావణమాసానికి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకొంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకొనే మహిళలు పట్టుచీరలతోను, నగలతోను కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందుకే శ్రావణమాసాన్ని ‘నగల మాసం, శనగల మాసం’ అంటూ చమత్కరించారట ముళ్లపూడి వెంకటరమణ.
తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. ఈ తెలుగు నెలలో పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం.. ఈ నక్షత్రం పేరుతొ ఏర్పడిన శ్రావణమాసం అని.. ఈ మాసంలో చేసే పూజలు అత్యంత ఫలప్రదమని పురాణాల కథనం.
విష్ణువు, లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ నెలలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దల చెబుతారు. అందుకే ఈ నెల హిందువుల ముంగిళ్ళు, ఇళ్ళు ఆలయాలను తలపిస్తాయి. వర్షఋతువులో వస్తుంది.. కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది జూలై 29 వ తేదీ (రేపటి)నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈనెలలో వచ్చే మంచి రోజులు, విశిష్ట పండగల గురించి తెలుసుకుందాం.
మంగళవారం మంగళగౌరి వ్రతం.. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు. ఈ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతి దేవికి మరొక రూపం అయిన గౌరీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన వధువులు.. తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు నిండు ముత్తైదువులుగా జీవిస్తారని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు నెలలోని అన్ని మంగళవారాలు చేయాలి.
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం: ఈ మాసంలో శ్రీ వరలక్ష్మీ దేవిని పూజిస్తూ.. ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానమని నమ్మకం. అంతేకాదు ఈరోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని, లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం సుఖ సంతోషాలతో నెలకొంటుందని ప్రగాఢ విశ్వాసం. దీనిని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 5 న ఆచరింపవలెను.
నాగ పంచమి: దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ.. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇది ఆగస్టు 2 వ తేదీ వచ్చింది. ఈ రోజున నాగులకు పూజలను నిర్వహిస్తారు. పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. ఉపవాసం ఉంటారు.
శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి: శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. సంతానం లేనివారు వ్రతాన్ని ఆచరించడం శుభఫలితాను ఇస్తుంది. పుత్ర సంతానం అంటే మగబిడ్డ కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.అంతేకాదు ఈరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. ఆగస్టు 8 న వచ్చింది.
శ్రావణ రాఖీపూర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణమి: తన అన్నదమ్ముల మేలు కోరుతూ మహిళలు.. సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. అన్నదమ్ములకు రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు ఆడబిడ్డను ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. అంతేకాదు… కొంతమంది తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుకనే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఆగస్టు 11/12 న రాఖీ వచ్చింది.
హయగ్రీవ జయంతి: శ్రావణ పున్నమి రోజున శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించడం కోసం హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. అందుకనే ఈరోజున కొన్ని ప్రాంతాల వారు హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. ఆగస్టు 12 న స్వామీ అనుగ్రహం కోసం పూజలు నిర్వహించి.. శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యంగా సమర్పి౦చడం మంచిది.
శ్రీకృష్ణాష్టమి: దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు శ్రీకృష్ణాష్టమి. ఈరోజుని కృష్ణ జన్మాష్టమిగా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఆగస్టు 19న వచ్చిన ఈ రోజు ఉట్టికొట్టడం ఆచారం. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.
కామిక ఏకాదశి: ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని (ఆగస్టు 23)కామిక ఏకాదశి అని అంటారు. ఈరోజున నవనీతాన్ని అంటే వెన్న దానం చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం.
కృష్ణ విదియ– శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.
పోలాల అమావాస్య: శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్యని పోలాల అమావాస్య గా పిలుస్తారు. సంతానం కోసం ఈరోజున మహిళలు ప్రత్యేక పూజను నిర్వహిస్తారు. ఈరోజున (ఆగస్టు 27) అమ్మవారిని పూజిస్తే.. పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం.
ఇక శ్రవణ మాసం అయిన వెంటనే విఘ్నాలకు అధినాయకుడు, పిల్లలకు విద్యా బుద్ధులు ఇచ్చే దేవుడైన విఘ్నేశ్వరుని పండగ - వినాయక చవితి ఆగస్టు ౩1న రానే వస్తుంది.
ఈ బ్లాగ్, దానిలో సమాచారం మీకు నచ్చిందా.. తపపకుండా అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలిస్తే.. కామెంట్ సెక్షన్లో షేర్ చేసి అందరితో పంచుకోండి!
Be the first to support
Be the first to share
Comment (0)