దేశంలో తొలి మంకీపాక్స్ మర ...
దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరులో 22 ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. పున్నియూర్‌కు చెందిన ఈ వ్యక్తి మంకీపాక్స్ కారణంగా ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి శాంపిళ్లను ఆరోగ్య శాఖ అధికారులు అలప్పుజలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. కానీ అతడికి యూఏఈలో మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. జూలై 22న అతడు కేరళ వచ్చాడని తెలుస్తోంది. ఆఫ్రికా వెలుపల నమోదైన నాలుగో మంకీపాక్స్ మరణం ఇది కావడం గమనార్హం. కేరళలో మంకీపాక్స్ మరణం నమోదు కావడంతోప్రజలంతా ఉలిక్కిపడుతున్నారు.
మెదడువాపు వ్యాధి, అలసటతో అతడు ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరగా.. అతడి కుటుంబీకులు శనివారం మంకీపాక్స్ టెస్ట్ రిజల్ట్‌ను హాస్పిటల్‌కు సమర్పించారు. మంకీపాక్స్ సోకిందనే విషయం వైద్యులకు ఆలస్యంగా అందించడం కూడా అతడి మరణానికి కారణంగా భావిస్తున్నారు. వైద్య చికిత్స ఎందుకు ఆలస్యమైందనే విషయమై విచారణ జరుపుతామని ఆరోగ్య మంత్రి వీణా జార్జి తెలిపారు. మరణించిన యువకుడితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను ఆరా తీస్తున్నామన్నారు. కాగా మంకీపాక్స్‌తో మరణించిన యువకుడు.. కేరళకు తిరిగొచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆటలాడాడని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకూ మన దేశంలో 4 మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో మే నెల నుంచి ఇప్పటి వరకూ 21 వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో 75 మంకీపాక్స్ అనుమానిత మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా నైజీరియా, కాంగో దేశాలకు చెందినవే..
ఇక ప్రస్తుతం పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా యూరప్ దేశాల్లో మంకీపాక్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో మంకీపాక్స్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి.
గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు కలిసి పని చేయాలని.. లైంగిక సంబంధాల విషయంలో సయంమనం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో ప్రజలకు పిలుపునిచ్చింది.
చనిపోయిన వ్యక్తికి మంకీపాక్స్ ఉంది అంటే, అతను ఆ వైరస్ వల్ల చనిపోయాడని అర్థం కాదు. అతని మరణానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు, నిపుణులు అతని వైద్య పరిస్థితిని విశ్లేషించిన తర్వాత మాత్రమే ఇది స్పష్టం అవుతుంది. “మంకీపాక్స్ చాలా తక్కువ మరణాల రేటును కలిగి ఉన్నందున, కేరళ వ్యక్తి మరణంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుంది, ”అని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చెప్పారు.
మే నుండి సుమారు 78 దేశాలలో 20,000 మందికి పైగా మంకీపాక్స్ అనారోగ్యానికి గురి చేసింది. అయితే, మరణాలలో ఎక్కువ భాగం ఆఫ్రికాలో సంభవించాయి. ఇక్కడ మంకీపాక్స్ వ్యాప్తి చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. మొత్తం మీద, ఆఫ్రికాలో 75 మందికి పైగా మరణించినట్లు నివేదించబడింది. ఇక ఆఫ్రికా వెలుపల, కేరళ మరణ౦ కాకుండా కేవలం మూడు మరణాలు మాత్రమే నమోదయ్యాయి.
మంకీపాక్స్ మరణానికి దారితీయడానికి చాలా తక్కువ అంటే 1 శాతం కంటే తక్కువ అవకాశం ఉంది. ఈ అంచనా కూడా ఆఫ్రికా నుండి వచ్చిన డేటాపై ఆధారపడినదే. గణాంకపరంగా, కేసులు- మరణాల నిష్పత్తి చాలా చాలా తక్కువగా ఉంది, అని భారతదేశంలోని ప్రముఖ ఎపిడెమియాలజిస్టులలో ఒకరైన డాక్టర్ ఆర్ గంగాఖేద్కర్ వెల్లడించారు.
సో, మంకీపాక్స్ అంటే అనవసంగా భయపడటం మాని.. నివారణ చర్యలు చేపట్టడం మంచిదని తెలిసింది కదా. మా బ్లాగ్ మీకు నచ్చితే, యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. మీ కామెంట్లు మాకు చాలా ఉపయోగకరం. దయచేసి కామెంట్ సెక్షన్ లో సూచనలు, అభిప్రాయాలు తెలియచేయండి.
Be the first to support
Be the first to share
Comment (0)