కోవిడ్ వ్యర్థాలు ఒక విపత్ ...
తొమ్మిదేళ్ళ శాన్వి స్కూల్ నించి ఇంటికి వచ్చింది. ఇంట్లో కాలు పెట్టగానే బూట్లు, సాక్సులు, యూనిఫాం, లంచ్ బాక్స్ చక్కగా వాటివాటి ప్లేస్ లలో పెట్టింది. ఇక మొహానికి ఉన్న మాస్కు తీసి ఉతకడానికి వేసింది. వాళ్ళ అమ్మను పిలుస్తూ, “మమ్మీ, నాకు రేపటి నుంచి యూజ్ అండ్ త్రో మాస్క్ పెట్టు.. మా క్లాస్ లో అందరూ అవే వాడుతున్నారు.” అని అడిగింది. కూతురి మాటలు విన్న హారిక.. వెంటనే ఏదో చెప్పబోయి ఒక్క క్షణం ఆగింది.
ఒక బాద్యత గల తల్లిగా, తన చిన్నారికి దీనిగురించి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందని హారికకు తోచింది. “సరే కానీ.. ముందు నేను చెప్పేది విను..” అంటూ కరోనా వ్యర్ధాలు ప్రపంచానికి ఎంత ముప్పుగా మారుతున్నాయో .. అందుకు మనవంతు చేయాల్సినదేమిటో ఇలా వివరంగా చెప్పింది.
కరోనా వ్యర్ధాలు ఏమవుతున్నాయో తెలుసా?
కరోనావైరస్ ప్రపంచాన్నే గడగడలాడించిన మహమ్మారి. దాని నియంత్రణకు, నివారణకు మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించా౦, ఇప్పటికీ వాడుతున్నాం కూడా. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. కోవిడ్ సురక్షక వస్తువులు వాడిన తర్వాత వాటిని సరైన విధంగా నిర్వీర్యం చేయడానికి సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య. వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. ఇవన్నీ చివరికి ఏమవుతున్నాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోతాయి. వివరంగా చెప్పాలంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి… నీటిలోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి.
ప్లాస్టిక్ బాంబుగా మారుతున్న కోవిడ్ మాస్కులు
ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ కరోనా మాస్కులను పరిశోధకులు ప్లాస్టిక్ బాంబుతో పోలుస్తున్నారు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల తదితరాల ప్రభావం రానున్న దశాబ్దాల్లో పర్యావరణంపై దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో కూడా జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని వారుసూచించారు.
వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు, చిన్నచిన్న జీవులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు ఎన్నో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికం ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం.
మనవంతు కృషిగా ఏం చేయాలంటే..
► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవచ్చు. హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడటం వల్ల పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే అవుతుంది.
► మనం అందరం యూజ్ అండ్ త్రో ఫేస్‌మాస్క్‌లు వాడితే కోట్ల టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే మళ్ళీ మళ్ళీ వాడగలిగే మాస్క్‌లు మంచివి. అంటే ఉతికి లేదా శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి వీలైనత వరకూ వాడటం ఉత్తమం. ఇవి పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు అవుతాయి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు.
► ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు తెలిసినవారు కూడా కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ, కరోనా విషయంలో కాగితపు సంచులు, బట్టతో చేసిన సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు.
► హోటళ్లలో, టీ స్టాల్స్ లో ఒకోసారి ఇంట్లో కూడా వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పుల వల్ల లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం.
అమ్మ చెప్పినదంతా విన్న సాన్వి ఆలోచనలో పడింది. ఆ పాపకి తను చేయాల్సింది ఏమిటో తెలిసింది. తను తెలుసుకున్న దాన్ని మరుసటి రోజు స్కూల్ లో తన ఫ్రెండ్స్ కి చెప్పడానికి ఉత్సాహంగా ఎదురు చూసింది.
మా బ్లాగ్ మీకు నచ్చిందా.. అయితే దయచేసి షేర్ చేయండి. మీరు సలహాలు, సూచనలు మాతో, మీ తోటి తల్లిదండ్రులతో పంచుకోవాలి అనుకుంటున్నారా . తప్పక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి! కీప్ ఫాలోయింగ్ parentune.com
Be the first to support
Be the first to share
Comment (0)